ఘనంగా యుక్తా ప్రథమ వార్షికోత్సవాలు

Date: 
Sun, 31/07/2011 (All day)
1st Annyal Celebrations

లండన్, 1 ఆగస్ట్: యునైటెడ్ కింగ్ డమ్  తెలుగు అసోసియేషన్ (యుక్తా) ప్రథమ వార్షికోత్సవ వేడుకలు లండన్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక తూర్పు లండన్ లో గల రాయల్ రీజెన్సీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 900 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.  సినీ నటుడు వెంకటేష్, పార్లమెంట్ సభ్యురాలు కిళ్ళి కృపారాణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖామాత్యులు ఏరాసు ప్రతాపరెడ్డి ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.ముఖ్య అతిథి బ్రిటన్ బిజినెస్ సెక్రటరీ డా ll విన్స్ కేబుల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత మాంద్య పరిస్థితులలో బ్రిటన్ దేశపు ఆర్ధిక అభివృద్ధికి తెలుగువారు ఎంతగానో దోహదపడుతున్నారని కొనియాడారు. తాను తొలి సారిగా 45 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సందర్శించానని, ఆనతి కాలంలోనే ఆ దేశం ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదగటం అక్కడి ప్రజల కష్టపడే తత్వాన్ని తెలుపుతోందని, అందుకే ఆ దేశప్రజలపై తనకు ఎనలేని అభిమానమని, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. త్వరలోనే భారత్-బ్రిటన్ పరస్పర మైత్రి పటిష్టపరిచే ప్రయత్నంలో మరల సందర్శించే అవకాశం రాగలదన్నఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా బ్రిటన్ రాణి అందించే ప్రతిష్టాత్మకమైన OBE పురస్కారాలు పొందిన తొలి తెలుగు మహిళలైన డా ll నిర్మలా రావు, పూర్ణిమ తణుకులను విన్స్ కేబుల్ సత్కరించారు. 

 

సినీ నటుడు వెంకటేష్ మాట్లాడుతూ జీవితం ఒక పరుగు పందెంలా మారిందని, లేని దానికోసం పాకులాడి, చేతిలో ఉన్నదాన్ని వదులుకోవటం అవివేకం అవుతుందని అన్నారు. ఏ విషయంలోనైనా ప్రయత్న లోపం ఉండకూడదని, ఫలితం ఎలా వచ్చినా దాన్నితట్టుకునే రీతిలో మనోధైర్యం అలవరుచుకోవాలని ఉద్భోదించారు.  పార్లమెంట్ సభ్యురాలు కిళ్ళి కృపారాణి మాట్లాడుతూ, యుక్తా ఆశయాలు చాలా ఆదర్శవంతంగా ఉన్నాయని, వాటిని ఇలాగే కొనసాగించాలని కమిటి సభ్యులకు తన అభినందనలు తెలిపారు. సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే తాను పరాయి దేశంలో కాక భారతదేశంలోనే ఉన్నభావన కలుగుతోందని తెలుగువారంతా ఇలా ఒక చోటకి చేరటం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని అన్నారు. ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వేడుకలకు వచ్చిన తెలుగువారి స్పందన చూస్తుంటే, తనకు హైదరాబాద్ రవీంద్రభారతిలోనే ఉన్నట్టు, భోజనం చేస్తుంటే నిజాం క్లబ్ లో బిర్యాని తిన్నట్లు ఉందని చమత్కరించారు. బ్రిటన్ లో స్థిరపడిన తెలుగు వారు తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించటానికి  తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. 
 
యుక్తా అధ్యక్షులు ప్రభాకర్ కాజా మాట్లాడుతూ భారత్ - బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను యుక్తా ప్రోత్సహిస్తోందని, తమ ప్రయత్నాలకు అండగా నిలుస్తున్న హిందుజ, టాటా వంటి దిగ్గజాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది కాలంలో సుమారు వంద మంది జీవిత సభ్యులుగా చేరారని, ఇదొక మరపురాని మైలురాయిగా పేర్కొన్నారు. తనకు  వెన్నుదన్నుగా నిలుస్తున్న కమిటి సభ్యులందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. 
 
బేబీ షర్లీన ప్రదర్శించిన కూచిపూడి నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై, దీప్తి సలాది కూచిపూడి, భారతీయ విద్యాభవన్ విద్యార్ధినులు ప్రదర్శించిన భరతనాట్యం, కథక్ నాట్యాలతో ఆ ప్రాంతంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వెల్లువిరిశాయి. షాన్, శ్రీనివాస్, కళ్యాణి ఆలపించిన గీతాలు, సుమన్ నృత్యం సభికులను అలరించాయి. ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యుక్తా సావనీర్ "యుక్తాముఖి"ని విడుదల చేశారు.
AttachmentSize
Sakshi.pdf227.67 KB
Suryaa.pdf743.91 KB

Sponsors